: అలాంటి ప్రతి నిర్మాత ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కు రూ.5 కోట్లు ఇవ్వాల్సిందే: బాలీవుడ్ కు రాజ్ థాకరే హెచ్చరిక
కరణ్ జోహార్ సినిమా 'యే దిల్ హై ముష్కిల్' రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎమ్మెన్నెస్ అధినేత కరణ్ జొహార్ బాలీవుడ్ నిర్మాతలకు పలు షరతులు పెట్టారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సమక్షంలో కరణ్ జొహార్, ముఖేష్ భట్ లతో సమావేశం అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "పాకిస్థానీ నటులకు వ్యతిరేకంగా మేము ఎప్పటి నుంచో నిరసన వ్యక్తం చేస్తున్నాం. కానీ, బాలీవుడ్ మాత్రం మా మాటలను పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు వారు కూడా రియలైజ్ అయ్యారు. భారత సినిమాలను, ఛానళ్లను పాకిస్థాన్ నిషేధించినప్పుడు... మనం మాత్రం పాక్ నటులకు రెడ్ కార్పెట్ ఎందుకు వేయాలని నేను ముఖేష్ భట్ ని ప్రశ్నించాను" అని రాజ్ తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తనను అడిగారని రాజ్ థాకరే తెలిపారు. దీనికి సమాధానంగా, ఉరీ ఘటనలో ప్రాణలు కోల్పోయిన జవాన్లకు నివాళి అర్పించే రీల్ ను సినిమాకు ముందు కరణ్ జొహార్ వేయాలని... పాకిస్థాన్ నటులను ఇకపై తమ సినిమాల్లో తీసుకోమంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని చెప్పానని రాజ్ వెల్లడించారు. అంతేకాకుండా, పాక్ నటులను తీసుకున్న ప్రతి నిర్మాత ఇప్పుడు తమ సినిమా రిలీజ్ కావాలంటే ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కు రూ. 5 కోట్లు ఇవ్వాలని తెలిపారు. ఈ డబ్బును చెల్లించడం ద్వారా వారు చేసిన తప్పును వారే కడిగేసుకున్నట్టు అవుతుందని అన్నారు. దీనికి నిర్మాతల మండలి ఒప్పుకుందని రాజ్ తెలిపారు.