: ఐఏఎస్ అధికారిణికి కూడా వేధింపులు... అసభ్యకర మెసేజ్ లు
మహిళలపై వేధింపుల ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే, ఏకంగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిణే వేధింపులకు గురికావడం సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం ఆమె కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు కార్యదర్శిగా పని చేస్తోంది. అయినా ఓ వ్యక్తి ఏకంగా నార్త్ బ్లాక్ కార్యాలయానికే ఫోన్ చేసి వేధిస్తున్నాడు. అసభ్యకర మెసేజ్ లకైతే అంతే లేదు. గత మూడేళ్లుగా ఆమె ఈ వేధింపులను భరిస్తోంది. బీహార్ లోని ఓ జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ఆమెకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అప్పట్లోనే తరచుగా వేధించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆమె ఢిల్లీకి ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈ క్రమంలో, ఆమెపై, ఆమె మూడేళ్ల కుమార్తెపై అతను పలుమార్లు దాడి చేశాడు. దారికి రాకుంటే యాసిడ్ పోస్తానని, కుమార్తెను చంపేస్తానని కూడా బెదిరించాడు. దీంతో, భయపడిపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, పోలీసులు ఈరోజు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 354డీ, 506ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, ఆ వ్యక్తి కూడా ఐఏఎస్ అధికారిణిపై ఆరోపణలు చేశాడు. ఆమె తన భార్య అని, చాలా కాలంగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపాడు. సమస్యల పరిష్కారం కోసం తాను ప్రయత్నిస్తుంటే, తనపై తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించాడు. దీనిపై స్పందించిన పోలీసులు... దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు వెల్లడవుతాయని తెలిపారు.