: కాఫీ తాగే మహిళలకు మాత్రమే!.. రోజూ మూడు కప్పులతో జ్ఞాపకశక్తి సమస్యలు దూరం!
టీ, కాఫీలు తాగడం అంతమంచిది కాదని కొందరు అంటే, వాటి వల్ల కూడా బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది మరికొందరి వాదన. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. అయితే తాజాగా అధ్యయనకారులు కాఫీ తాగే మహిళలకు చిక్కని కాఫీలాంటి వార్త చెప్పారు. రోజూ మూడు కప్పుల వేడివేడి కాఫీ తీసుకోవడం ద్వారా వృద్ధాప్యంతో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను దూరం చేసుకోవచ్చని పేర్కొన్నారు. డిమెన్షియా, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు మూడు కప్పుల కాఫీతో చెక్ పెట్టవచ్చని తెలిపారు. విస్కాన్సిన్ యూనివర్సిటీ నిర్వహించిన తాజా పరిశోధనలో ఈ విషయం బయటపడింది. అధ్యయనం కోసం మెనోపాజ్ దశకు చేరుకున్న 6,467 మంది మహిళలను అధ్యయనకారులు ఎంచుకున్నారు. వారి ఆహారపు అలవాట్లతోపాటు వారు రోజూ ఎన్ని కప్పుల కాఫీ తీసుకుంటున్నారన్న విషయాన్ని గమనించారు. దాదాపు పదేళ్ల పాటు సాగిన ఈ అధ్యయనంలో కాఫీతో జ్ఞాపకశక్తి సమస్యలను దూరం చేయవచ్చని తేలింది. ప్రతి రోజూ మూడు కప్పుల కాఫీ (దాదాపు 266 మిల్లీ గ్రాముల కెఫిన్) తీసుకునే వారిలో మిగతా వారితో పోలిస్తే మతిమరుపు సమస్య చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అంతేకాక ఇతరుల జ్ఞాపకశక్తితో పోలిస్తే రోజూ మూడు కప్పుల కాఫీ తీసుకునే వారిలో 30 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. సో.. ఇంకెందుకాలస్యం.. రోజూ మూడు కప్పుల కాఫీ.. ఓకేనా!