: ప్రజలే నాకు ముఖ్యం.. వారే నా హై కమాండ్: సీఎం చంద్రబాబు
‘ప్రజలే నాకు ముఖ్యం.. ప్రజలే నా హై కమాండ్’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు విజయవాడలో నిర్వహించిన కాపు జాబ్ మేళాకు ఆయన హాజరయ్యారు. ఉద్యోగాలు సాధించిన యువతకు ఈ సందర్భంగా ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, కాపుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. కాపులను బీసీల్లోకి చేర్చేందుకు మంజునాథ కమిషన్ ఏర్పాటు చేశామని, కాపు భవన్ కు నిధులు ఇచ్చామని, కాపు విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలు రాష్ట్రంలో నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామని, ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా వచ్చే ప్రయోజనాలతో ఏపీని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు.