: లక్షల ఇళ్లను దొంగ బిల్లులతో అక్రమార్కులు స్వాధీనం చేసుకున్నారు: మంత్రి పోచారం
తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి తిప్పికొట్టారు. తాము చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేకే తమపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నకిలీ విత్తనాలతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ తనను బర్తరఫ్ చేయాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేయడం పట్ల పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉత్తమ్‌కుమార్ గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పక్కా గృహాల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. లక్షల ఇళ్లను దొంగ బిల్లులతో అక్రమార్కులు స్వాధీనం చేసుకున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు సిద్ధమేనని పోచారం చెప్పారు. వాటి పనులు పూర్తి చేసి ఆ కర్మాగారాన్ని రైతులకు అప్పగిస్తామని చెప్పారు. రైతులే ఫ్యాక్టరీని నడుపుకునేలా తమ ప్రభుత్వం సన్నద్ధమవుతున్న సమయంలో మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి షుగర్ ఫ్యాక్టరీపై పాదయాత్ర చేస్తూ నిరసనలు తెలుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.