: 'ఉడాన్' వచ్చేస్తోంది... గంట విమాన ప్రయాణానికిక రూ. 2,500 మాత్రమే


మోదీ సర్కారు మనసులో నుంచి వచ్చిన మరో కలల ప్రాజెక్టు ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) ముసాయిదా సిద్ధమైంది. గంట విమాన ప్రయాణానికి రూ. 2,500 మాత్రమే వసూలు చేయాలన్నది ఉడాన్ ఉద్దేశం. ప్రపంచ విమానయాన రంగంలో ఈ తరహా ప్రభుత్వ విధానం రూపకల్పన కావడం ఇదే తొలిసారి. ఈ స్కీములో ప్రభుత్వం ప్రతిపాదించిన వివరాల ప్రకారం, విమానంలోని సీట్లలో కనీసం 50 శాతం సీట్లను ఉడాన్ లో భాగంగా విక్రయించాల్సి వుంటుంది. మిగిలిన సీట్లు మార్కెట్ ఆధారిత ధరా విధానంలో విక్రయించుకోవచ్చు. ఉడాన్ గురించి తాము ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ రోజు వ్యాఖ్యానించారు. జనవరి 2017 నుంచి ఈ విధానం అమల్లోకి రానుందని వెల్లడించారు. గడచిన జూలైలో ఉడాన్ స్కీమ్ ముసాయిదా తొలిసారిగా బయటకు రాగా, ఆపై ఇండస్ట్రీ అభిప్రాయాలను తెలుసుకుని దీనికి తుదిరూపును ఇచ్చామని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ దూబే వెల్లడించారు. మరో రెండు రోజుల్లో సుంకాల విషయమై గజెట్ లో ముసాయిదా పూర్తి వివరాలు ప్రచురితమవుతాయని, ఆపై నెలాఖరులోగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News