: కేసీఆర్ కు చెప్పేంత పెద్దదాన్ని కాదంటూ, వైఎస్ ను తలచుకున్న ఎంపీ కవిత!
తెలంగాణ ప్రభుత్వంలో మహిళలు మంత్రి పదవుల్లో లేకపోవడం పెద్ద సమస్య కాదని, మహిళాభ్యుదయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, మహిళలకు మంత్రి పదవులు దక్కాలన్న కోరిక తనకుందని, అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పేంత పెద్దదాన్ని తాను కాదని వ్యాఖ్యానించారు. సమయం వచ్చినపుడు మహిళలకు పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతిని, బతుకమ్మ పండగలను ప్రస్తావిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆమె గుర్తు చేసుకున్నారు. తెలుగు భాష వ్యాప్తికి ఆయన ఎంతో కృషి చేశారని, ఆయన కృషి వల్లే తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాతనే బతుకమ్మ పండగకు ఆదరణ పెరిగిందని, విదేశాల్లో సైతం విజయవంతమైందని గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు సొంతగడ్డపై సరైన గుర్తింపు దక్కలేదని, ఆయనకు రావాల్సినంత కీర్తి ప్రతిష్టలు రాలేదని కవిత వ్యాఖ్యానించారు.