: బాలీవుడ్ ను ఆకట్టుకుంటున్న విభిన్న 'కాబిల్' టీజర్
వినూత్న ఆలోచనలతో ఆసక్తికరంగా వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తాయన్నది చాలా కాలంగా నిరూపితమవుతోంది. తాజాగా హృతిక్ రోషన్ 'కాబిల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'మొహెంజదారో' ఘోరపరాజయం తరువాత హృతిక్ నటించిన సినిమా ఇదే. ఈ సినిమాలో హృతిక్ సరసన యామి గౌతమ్ నటిస్తోంది. జనవరి 26, 2017న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా తొలి టీజర్ ను ఈ సినిమా యూనిట్ విడుదల చేసింది. "మీ కళ్లు తెరిచే ఉంటాయి...కానీ మీరేమీ చూళ్లేరు. మీ చెవులు కూడా పని చేస్తాయి...కానీ మీరేమీ వినలేరు. మీ గొంతు తెరిచే ఉంటుంది...కానీ మీరేమీ మాట్లాడలేరు. అంత కంటే గొప్ప విషయం ఏంటంటే...మీకు మొత్తం అర్థమవుతుంది. కానీ భవిష్యత్ లో ఎవరికీ అర్థమయ్యేలా చెప్పలేరు" అంటూ సాగే టీజర్ వినూత్నంగా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లో కేవలం అక్షరాలు, వెలుతురు మాత్రమే కనిపిస్తూ హృతిక్ గొంతు వినిపిస్తుండడం ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. 'కాబిల్' సినిమా కు నిర్మాతగా రాకేష్ రోషన్ వ్యవహరిస్తుండగా, అతని చిన్నాన్న రాజేష్ రోషన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 26న విడుదల చేయనున్నారు. మీరు కూడా ఆ టీజర్ ను చూడండి.