: మోదీకి ఆహ్వాన పత్రిక పంపనున్న గాలి... ఎన్టీఆర్, మహేష్ బాబులు వెళ్లడం డౌటే!
అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడు, కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పెళ్లి కార్డుతోనే ఔరా అనిపించుకున్న గాలి... పెళ్లికి దేశంలోని ప్రముఖులను ఆహ్వానించాలనుకుంటున్నారు. ఆయన ఆహ్వానితుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారని సమాచారం. అయితే, అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, జైలు జీవితాన్ని కూడా అనుభవించి, బెయిల్ పై బయటకు వచ్చిన గాలి వివాహానికి మోదీ హాజరవుతారా? అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. జైలు శిక్ష అనుభవించిన గాలి ఇంట్లో జరిగే వేడుకకు హాజరైతే... పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపడానికి రంగం సిద్ధమైంది. టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లతో పాటు పలువురు దర్శక, నిర్మాతలకు ఆహ్వానాలు పంపాలని గాలి భావిస్తున్నారు. అయితే, ఆ వివాహానికి వీరు హాజరవుతారా? అనే విషయంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కేంద్ర మంత్రులు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, కుమారస్వామి గౌడ వివాహానికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ను ఆహ్వానిస్తామని... అయితే, ఆమె పెళ్లికి వస్తారనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని గాలి అనుచరుడు, బళ్లారి ఎంపీ శ్రీరాములు తెలిపారు.