: యావత్ ప్రపంచం మీ వైపు అనుమానంగా చూస్తోంది: పాక్ తో అమెరికా
ప్రపంచంలోని అన్ని దేశాలూ పాకిస్థాన్ వైపు అనుమానంగా చూస్తున్నాయని అమెరికా వ్యాఖ్యానించింది. ఉగ్రవాద నిరోధక చర్యలను సమర్థవంతంగా చేపట్టడంలో పాక్ విఫలమవుతోందని ఆరోపిస్తూ, ఈ విషయంలో పాక్ నిబద్ధతపై అనుమానాలున్నాయని అమెరికన్ ప్రతినిధులు తనతో చెప్పినట్టు పాక్ విదేశాంగ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భారత్ తో తిరిగి చర్చలు ప్రారంభించే దిశగా ముందడుగు వేయడం లేదని అమెరికా భావిస్తోందని, ఇండియాకన్నా, పాక్ వైపే తప్పు అధికంగా ఉన్నట్టు అమెరికా భావిస్తోందని 'ది నేషన్' పత్రికకు ఆ అధికారి తెలిపారు. వాస్తవానికి తాము పలుమార్లు చర్చలకు భారత్ ను ఆహ్వానించినప్పటికీ, ఆ దేశమే స్పందించడం లేదని పాక్ తమకు ఫిర్యాదు చేసిందని, అయితే ముందుగా పాక్ తనపై యాంటీ టెర్రర్ ఇమేజ్ ను పెంపొందించుకోవాలని ఆ అధికారి అన్నారు.