: ముఖేష్ అంబానీ ఆస్తి...యూరోపియన్ కంట్రీ జీడీపీతో సమానం!


ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ ఆస్తి ఒక యూరోపియన్ దేశ స్థూల జాతీయోత్పత్తితో సమానం అంటే ఆశ్చర్యం కలుగకమానదు. కానీ ఇది వాస్తవం! భారత దేశంలో అగ్రవ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ ఆస్తి అంతకంతకూ పెరుగుతోంది. ఇలా పెరుగుతూ పోయి ఉత్తర యూరోప్‌ లోని ఎస్తోనియా దేశ స్థూల జాతీయోత్పత్తితో సమానంగా నిలిచిందని ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ వెల్లడించింది. ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం భారత్ లో కుబేరుడైన ముఖేష్‌ అంబానీ ఆస్తి విలువ 22.7 బిలియన్‌ డాలర్లు. ఈ మొత్తం ఎస్తోనియా జీడీపీతో సమానమని చెప్పింది. ఆయన తరువాతి స్థానంలో ఉన్న సన్‌ ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ ఆస్తి 16.9 బిలియన్‌ డాలర్లు. మూడో స్థానంలో హిందుజా కుటుంబం ఉండగా, వారి ఆస్తి 15.2 బిలియన్‌ డాలర్లు. విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌ జీది ఈ జాబితాలో నాలుగో స్థానం కాగా, ఆయన ఆస్తి విలువ 15 బిలియన్‌ డాలర్లు. ఆయన ఆస్తి మొజాంబిక్‌ దేశ స్థూల జాతీయోత్పత్తితో సమానమని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక ఐదో స్థానంలో 13.90 బిలియన్‌ డాలర్ల ఆస్తితో పల్లోంజి మిస్త్రీ నిలిచారని ఫోర్బ్స్ తెలిపింది. ఈ ఐదుగురు ధనవంతుల ఆస్తితో 1,230 సార్లు మంగళ్యాన్‌ చేయవచ్చని, లేదా 18 సార్లు రియో ఒలింపిక్స్‌ నిర్వహించవచ్చంటూ ఫోర్బ్స్ మ్యాగజీన్ తెలిపింది.

  • Loading...

More Telugu News