: దీపావళికి చైనా టపాసులు వద్దు: బీహార్ పంచాయతీ నిర్ణయం
సోషల్ మీడియాలో చైనా వస్తు బహిష్కరణ ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో, బీహార్ లోని ఓ పంచాయతీ చైనా వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే...సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం పాకిస్థాన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పాక్ కి అన్ని రకాలుగా వత్తాసు పలుకుతున్న చైనాపై కూడా భారతీయులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ను నయవంచన చేస్తున్న చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో బీహార్ లోని ఓబ్రా ప్రాంత సర్పంచి గుడియాదేవి చైనా ఉత్పత్తులను ఉపయోగించొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళికి దానిని అమలు చేయాలంటూ గ్రామస్థులకు సూచించారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించడం వల్ల ఆ దేశానికి ఓ గుణపాఠాన్ని చెప్పినట్లు అవుతుందని పేర్కొన్న ఆమె, ఈ విషయంలో ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. భారతీయులంతా చేతులు కలిపి చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఓబ్రా నుంచి ఇదో చిన్న ప్రారంభమని చెప్పిన ఆమె, ఇది ఉప్పెనగా మారి చైనాపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆమె ఆకాంక్షించారు. పంచాయతీ ఆదేశాలను ధిక్కరించి చైనా ఉత్పత్తుల అమ్మకాలు జరిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని, జరిమానా విధించేందుకు వెనుకాడమని గుడియా దేవి గ్రామస్థులకు హెచ్చరికలు జారీ చేశారు.