: ‘నేను మహిళలను గౌరవిస్తాను’ అన్న ట్రంప్ వ్యాఖ్యలకు పగలబడి నవ్విన ఆడియన్స్!
‘నేను గౌరవించినంతగా మహిళలను మరెవరూ గౌరవించరు’ అనే డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆడియన్స్ పగలబడి నవ్వారు. లాస్ వెగాస్ లో నిన్న జరిగిన చివరి ప్రెసెడెన్షియల్ డిబేట్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో, ఈ డిబేట్ కు సమన్వయకర్తగా వ్యవహరించిన ఫాక్స్ న్యూస్ యాంకర్ క్రిస్ వాలస్ కల్పించుకుని ‘ప్లీజ్, ఎవిరిబడీ’ అంటూ నిశ్శబ్దంగా ఉండాలంటూ ఆడియన్స్ ని కోరారు. మహిళలపై లైంగిక దాడులకు ట్రంప్ పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తనపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఈ వ్యాఖ్యలు చేయడం ఆడియన్స్ కు నవ్వు తెప్పించాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఫలానా మహిళలపై ట్రంప్ లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ క్లింటన్ క్యాంపెయిన్ చేసిన ఆరోపణలను విన్న కొద్ది సేపటి తర్వాత ఆయన స్పందిస్తూ..‘ఇవన్నీ అబద్ధాలు, ఇదంతా కట్టుకథ’ అని కొట్టి పారేశారు. అయినప్పటికీ ట్రంప్ ను వదిలిపెట్టని హిల్లరీ స్పందిస్తూ, మహిళలను తక్కువ చేసి చూడటం వల్ల తాను ఎదిగిపోతానని ట్రంప్ అనుకుంటున్నారని ఆరోపించారు. మహిళల పట్ల డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా మాట్లాడుతున్నది, ఆలోచిస్తున్నది, ఏ విధంగా ప్రవర్తిస్తున్నది తమకు తెలుసునని హిల్లరీ అన్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సమాధానమిస్తూ, ‘మహిళలకు నేను ఇచ్చినంత గౌరవం మరెవ్వరూ ఇవ్వరు’ అని మరో వాక్యం ట్రంప్ మాట్లాడేలోపే డిబేట్ కు హాజరైన ఆడియన్స్ విరగబడి నవ్వారు.