: తన 30 ఏళ్ల అనుభవాన్ని ట్రంప్ తో పోల్చుతూ చక్కగా వివరించి మార్కులు కొట్టేసిన హిల్లరీ క్లింటన్


ఆఖరి బిగ్ డిబేట్ లోనూ రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై హిల్లరీ ఆధిపత్యాన్ని సాధించారు. ఆయనకున్న అనుభవాన్ని ప్రశ్నించిన హిల్లరీ, తాము ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ లో చుట్టుముట్టి, అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్న సమయంలో ట్రంప్ ఓ రియాలిటీ టీవీషోను నిర్వహిస్తున్నాడని ఎద్దేవా చేశారు. "1980లో నేను ఆర్కన్సాస్ పాఠశాలల్లో సంస్కరణల అమలుకు కృషి చేస్తున్న వేళ, ట్రంప్ తన తండ్రి నుంచి వ్యాపారం కోసం 14 మిలియన్ డాలర్లు అప్పు తీసుకున్నారు. 1990లో నేను బీజింగ్ వెళ్లి, మహిళా హక్కులపై మాట్లాడిన వేళ, మిస్ యూనివర్స్ పోటీల్లో ట్రంప్ యువతులను అవమానపరిచారు. ఒసామా బిన్ లాడెన్ కోసం అమెరికా సైన్యం పాక్ లో ఆపరేషన్ చేపట్టిన వేళ, నేను అధికారులతో కలసి ఓ గదిలో ఉండి ఆపరేషన్ ను పరిశీలిస్తుంటే, ట్రంప్, సెలబ్రిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు" అని హిల్లరీ ఎద్దేవా చేశారు. తన 30 సంవత్సరాల అనుభవాన్ని ట్రంప్ తో పోల్చుకోవడానికి ఎంతో సంతోషంగా ఉన్నానని అన్నారు. అంతకుముందు ప్రజా జీవితంలో హిల్లరీ అనుభవాన్ని ట్రంప్ ప్రశ్నించగా, అందుకు ఆమె సరైన సమాధానం చెప్పిందని అమెరికన్లు అభిప్రాయపడటం గమనార్హం.

  • Loading...

More Telugu News