: ఫైనల్ డిబేట్ లో ఆకట్టుకున్నా.. ట్రంప్ ఎందుకు విఫలమయ్యాడన్న దానిపై బీబీసీ కథనం!


అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఫైనల్ డిబేట్ ముగిసింది. ఇందులో రిపబ్లికన్ డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్‌ మధ్య లాస్‌ వెగాస్‌ లోని నెవాడా యూనివర్సిటీలో జరిగిన ఫైనల్ బిగ్ డిబేట్ లో ఇద్దరూ హోరాహోరీ తలపడ్డారు. సంధానకర్త ప్రశ్నలకు సమాధానమిస్తూనే, ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకున్నారు. గత రెండు బిగ్ డిబేట్ల కంటే ఇందులో ట్రంప్ మెరుగ్గా సమాధానాలు చెప్పారు. ఈ బిగ్‌ డిబేట్‌ ట్రంప్‌ కోరుకున్నట్లుగానే జరిగింది కానీ, అతనికి అనుకూలంగా జరగలేదని బీబీసీ పేర్కొంది. తన వాణిని సమర్థవంతంగా వినిపించేందుకు దక్కిన చివరి అవకాశాన్ని కూడా ట్రంప్ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారని బీబీసీ అభిప్రాయపడింది. ట్రంప్‌ ఓ అధ్యక్షుడిగా తనకు ఉండాల్సిన లక్షణాలు నిరూపించుకోలేదని పేర్కొంది. కనీసం తనపై వస్తున్న లైంగిక ఆరోపణలు తప్పని చెప్పలేకపోయారని తెలిపింది. సుప్రీంకోర్టు, గన్‌ రైట్స్‌, అబార్షన్‌, ఇమ్మిగ్రేషన్‌ విషయాలను జాగ్రత్తగా హేండిల్ చేసిన ట్రంప్... ఒక్కసారిగా పాత పంథాలోకి వెళ్లిపోయి, ప్రత్యర్థి హిల్లరీను విమర్శించడం మొదలెట్టారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హిల్లరీ అబద్ధాల కోరని, తనపై లైంగిక ఆరోపణలు చేసిన వారు హిల్లరీ మద్ధతుదారులేనని విమర్శించడంతోనే ఆగని ట్రంప్, మీడియా తనపై కక్షగట్టి ప్రజలకు లేనిపోని విషయాలు నూరిపోస్తోందని ఆరోపణలు చేశారు. దీంతో ఈ డిబేట్‌ లో చర్చించాల్సిన అంశాల కంటే విమర్శలు, అసహనమే ఎక్కువైపోయాయి. దీంతో ట్రంప్ చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్నారని బీబీసీ అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News