: సర్జికల్ దాడుల నేపథ్యంలో సినిమా తీయనున్న ఆధ్యాత్మిక గురువు
సంచలనాలకు మారుపేరైన ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో భారత్ సైన్యం జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో సినిమా తీయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు 'ఎం.ఎస్.జి - ది లయన్ హార్ట్ - హింద్ కా నాపాక్ కో జవాబ్' అనే పేరు పెట్టినట్టు తెలిపారు. సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేసిన వారికి ఈ సినిమా సమాధానం చెబుతుందని రామ్ రహీమ్ సింగ్ అన్నారు. 'ఎం.ఎస్.జి - ది వారియర్ లయన్ హార్ట్' సినిమా విజయోత్సవ సభలో మాట్లాడుతూ, దేశంలో నెలకొన్న పరిస్థితులను కొత్త సినిమాలో చూపించబోతున్నట్టు రామ్ రహీమ్ తెలిపారు. 25 రోజుల్లో ఈ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 18న ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారని... దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించిందని తెలిపారు. మన సైనికులు తరచుగా ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ, దీనిపై ఎంత మంది మాట్లాడుతున్నారని ప్రశ్నించిన ఆయన... సర్జికల్ దాడులకు మాత్రం ఆధారాలు చూపాలని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి తన సినిమా ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.