: మోదీ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్... విచారణకు స్వీకరించిన హైకోర్టు
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి ఎంపీగా గెలుపొందిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను మోదీపై కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన అజయ్ రాయ్ అనే వ్యక్తి వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, మోదీ ఎన్నిక ఎందుకు చెల్లదో వివరిస్తూ, పిటిషనర్ అసంబద్ధపు కారణాలను పేర్కొన్నారని, పిటిషనర్ చేసిన ఆరోపణలు ప్రజా ప్రతినిధుల చట్టం కిందకు రావని, ఈ పిటిషన్ అసలు విచారణార్హమే కాదని మోదీ తరపు లాయర్లు వాదించారు. అయినా, పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనికి సంబంధించి, నవంబర్ 15వ తేదీన తదుపరి విచారణ జరగనుంది. ఎన్నికల సమయంలో మోదీ చిత్రాలున్న టీషర్ట్ లను, పోస్టర్లను ఓటర్లకు పంచిపెట్టారని... ఇది ఓ విధంగా ఓటర్లకు లంచం ఇవ్వడం కిందకే వస్తుందని అజయ్ రాయ్ తన పిటిషన్లో పేర్కొన్నారు.