: 'అమ్మ' భక్తిని మరోసారి చాటుకున్న పన్నీర్‌ సెల్వం.. 'పురచ్చితలైవి' ఫొటోను పక్కన పెట్టుకొని కొనసాగించిన మంత్రివర్గ భేటీ


త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌యల‌లిత సెప్టెంబరు 22 నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి శాఖ‌ల బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆ రాష్ట్ర‌ ఆర్థికమంత్రి ప‌న్నీర్ సెల్వం అధ్య‌క్ష‌త‌న తొలిసారి ఈ రోజు త‌మిళ‌నాడు మంత్రివ‌ర్గం భేటీ అయింది. అందులో కావేరీ జ‌లాల వివాదంపై ప్ర‌ధానంగా చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. అయితే, జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్‌సెల్వం ఆమెపై మ‌రోసారి త‌న భ‌క్తిని చాటారు. తాను కూర్చున్న కుర్చీ ముందు జ‌య‌ల‌లిత చిత్రపటాన్ని ఉంచి ఈ స‌మావేశాన్ని కొన‌సాగించారు. 32 మంది మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ రోజు ఉద‌యం గంట‌సేపు ఈ భేటీ జ‌రిగింది. ఆ రాష్ట్రంలో ఈ నెల 24తో కౌన్సిలర్లు, మేయర్ల పదవీ కాలం ముగుస్తుంది. దీంతో ఈ అంశంపై కూడా కేబినెట్ భేటీలో చ‌ర్చించిన‌ట్లు అక్క‌డి అధికారులు మీడియాకు తెలిపారు. గ‌త నెల‌ జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో ప్రభుత్వంతో సంబంధిత అధికారులు ఓ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకోసం ఇన్వెస్టర్లకు భూముల కేటాయింపు చేసే విష‌యాన్ని కూడా భేటీలో చ‌ర్చించారు.

  • Loading...

More Telugu News