: ఆ దేశంలో ఎవరైనా సరే, ఎలుకలను పట్టొచ్చు.. డాలర్లు కొట్టొచ్చు!


ఇండోనేషియా రాజధాని జకార్తా లో దాదాపు కోటి వరకు జనాభా ఉంటుంది. ఈ జనాభాకు ఏమాత్రం తీసిపోకుండా ఎలుకల జనాభా కూడా అక్కడ బాగానే ఉంది. దీంతో, వీటి బాధ తట్టుకోలేక జకార్తా వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎలుకల ద్వారా భయంకరమైన వ్యాధులు సంక్రమించే అవకాశాలున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు గాను ‘ర్యాట్ ఇరాడికేషన్ మూమెంట్’ పథకాన్ని అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా జకార్తా గవర్నర్ జరోత్ సైఫుల్ హిదాయత్ పేర్కొన్నారు. ఇక ఈ పథకంలో భాగంగా ఎవరైనా సరే, ఎలుకలు పట్టవచ్చని, అందుకు తగిన రివార్డు కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఒక్కో ఎలుకకు 1.5 డాలర్ల చొప్పున అందజేస్తామని హిదాయత్ తెలిపారు. ఎలుకలను పట్టుకున్న వ్యక్తులు ఆయా స్థానిక అధికారులకు వాటిని అప్పగిస్తే, దాని ప్రకారం డబ్బు చెల్లింపులు ఉంటాయన్నారు. అయితే, ఎలుకలను పట్టుకునేందుకు తుపాకుల వంటి ప్రమాదకరమైన వస్తువులను వాడవద్దని హెచ్చరించారు. పట్టిచ్చిన ఎలుకలను ఖననం చేసే బాధ్యత జకార్తా సానిటేషన్ ఏజెన్సీ అధికారులది అని ఆ వెబ్ సైట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News