: టీచర్స్ డే రోజున గురువును ఆనందాశ్చర్యంలో ముంచెత్తిన కోహ్లీ
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 2014 టీచర్స్ డే (గురుపూజోత్సవం) సందర్భంగా తన గురువు రాజ్ కుమార్ శర్మకు మర్చిపోలేని బహుమతి అందజేశారు. విరాట్ కోహ్లీ ఉత్తమ క్రికెటర్ గా రూపుదిద్దుకోవడంలో రాజ్ కుమార్ శర్మ పాత్ర ఎనలేనిది. కఠిన శిక్షణతో ఉత్తమ క్రికెటర్లను తయారు చేసే ప్రయత్నం చేస్తున్న ఆయనను 2014 గురుపూజోత్సవం నాడు అనూహ్యమైన బహుమతితో భావోద్వేగానికి గురిచేశాడు. దీనిపై క్రీడా పాత్రికేయుడు విజయ్ లోకపల్లి రాసిన ‘డ్రివెన్’ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ రోజు చోటుచేసుకున్న ఆ ఘటన గురించి రాజ్ కుమార్ శర్మ ఏం చెప్పారంటే... ‘డోర్ బెల్ మోగడంతో తలుపు తీశాను. ఎదురుగా విరాట్ సోదరుడు వికాస్ కనిపించాడు. ఉదయాన్నే రావడంతో ఏదో ఉందనిపించింది. వికాస్ కాల్ చేసి, ఫోన్ నా చేతికందించాడు. ఫోన్ లో కోహ్లీ గురుపూజోత్సవం శుభాకాంక్షలు చెబుతుండగా, వికాస్ తాళం చెవులు తీసి నా చేతుల్లో పెట్టాడు. ఏంటని అడుగుతుండగానే ఇంటి బయటికి తీసుకొచ్చి, మెరుస్తున్న స్కోడా రాపిడ్ కారును చూపించాడు. ఆ బహుమతి నన్ను ఆశ్చర్యపరచలేదు కానీ, ఇన్నాళ్లైనా నాతో అనుబంధాన్ని కొనసాగిస్తూ నన్ను గౌరవించడం పట్ల విరాట్ చూపించిన సంస్కారానికి భావోద్వేగానికి గురయ్యాను’ అని పేర్కొన్నారు.