: కృష్ణా జ‌లాల‌పై ట్రైబ్యున‌ల్ తీర్పు వెల్ల‌డి .. కర్ణాటక, మహారాష్ట్రలకు వాటా లేదని తీర్పు!


కృష్ణా న‌దీ నీటి పంప‌కాల‌పై దేశ రాజ‌ధాని ఢిల్లీలో విచార‌ణ జ‌రిపిన ట్రైబ్యున‌ల్ ఈ రోజు ఉద‌యం తీర్పును వెల్ల‌డించింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా జ‌లాలు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్యే పంపిణీ జ‌ర‌గాల‌ని సూచించింది. ఈ జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్రలకు వాటా లేదని తేల్చి చెప్పింది. నాలుగు వారాల్లోగా ఇరు రాష్ట్రాలు త‌మ అభ్యంత‌రాల‌ను, వాద‌న‌ల‌ను దాఖ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై త‌దుప‌రి విచార‌ణ‌ను డిసెంబ‌రు 14కు వాయిదా వేసింది. అభ్యంత‌రాల‌ు ఏమయినా ఉంటే ఆ రోజున ప‌రిశీలిస్తామ‌ని చెప్పింది. కృష్ణా న‌దీ జలాల పంపిణీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ రాష్ట్రాలకేనని క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌ల‌కు లేద‌ని కేంద్ర జలవనరుల శాఖ కొన్ని రోజుల క్రితం ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు( 2013 నవంబరు 29న) కృష్ణా జల వివాదంపై ట్రైబ్యునల్ బచావత్‌ ట్రైబ్యునల్‌ చేసిన కేటాయింపులను కొనసాగిస్తూనే ఓ తీర్పును చెప్పిన విష‌యం తెలిసిందే. దాని ప్ర‌కారం 65 శాతం నీటి లభ్యత, సరాసరి నీటి లభ్యత కింద మిగులు జలాలను కూడా కేటాయించింది. అయితే, ట్రైబ్యున‌ల్ ఇచ్చిన ఈ తీర్పును వ్యతిరేకించిన అప్ప‌టి రాష్ట్ర‌ ప్ర‌భుత్వం 2014 జనవరిలో సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది. ఈ అంశంపై కర్ణాట‌క, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా సుప్రీంను ఆశ్ర‌యించాయి. సుప్రీంలో మధ్యంతర ఉత్తర్వులో ట్రైబ్యున‌ల్‌ చేసిన కేటాయింపులో నాలుగు టీఎంసీలను తగ్గించి ఉమ్మ‌డి ఏపీకి కేటాయిస్తూ తీర్పు ఇవ్వడాన్ని కర్ణాటక ప్ర‌భుత్వం అభ్యంత‌రం చెప్పింది. మ‌రోవైపు గెజిట్‌లో ఈ తీర్పు నోటిఫై చేయాలని మహారాష్ట్ర కూడా దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని కోరింది. 2014లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన అనంత‌రం తెలంగాణ ఈ కేసులో భాగస్వామి అయింది. కృష్ణా నీరు తెలుగు రాష్ట్రాల‌కేనా లేక‌ నాలుగు రాష్ట్రాలకా అన్న అంశంపై అనేక త‌ర్జ‌నభ‌ర్జ‌న‌లు జ‌రిగిన త‌రువాత‌, అన్న రాష్ట్రాల వాద‌న‌లు విన్న ట్రైబ్యునల్ ఈ రోజు పై విధంగా తీర్పునిచ్చింది.

  • Loading...

More Telugu News