: గిఫ్టులంటేనే భయపడుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గిఫ్టుల భయం వెంటాడుతోంది. ఇంకా చెప్పాలంటే గిఫ్టులంటేనే ఆయన బెంబేలెత్తిపోతున్నారు. గతంలో తన స్నేహితుడి నుంచి అత్యంత ఖరీదైన రూ. 70 లక్షల హోబ్లేట్ వాచ్ ను ఆయన స్వీకరించారు. ఈ విషయంపై కర్ణాటకలో పెద్ద దుమారమే రేగింది. బీజేపీ నేతలైతే ఆయనపై ముప్పేట దాడి చేశారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ కూడా సిద్దూని ఏకిపారేశారు. అంతేకాదు, ఈ విషయం ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం వరకు వెళ్లింది. అయితే, ఏసీబీ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన దాన్నుంచి బయటపడ్డారు. కానీ, ఆ భయం మాత్రం ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా, తన మంత్రివర్గ సహచరుడు, పశుసంవర్ధక మంత్రి ఏ.మంజు విధానసౌధలో సిద్ధరామయ్యకు గిఫ్ట్ ఇవ్వబోయారు. ఆయన మాత్రం ఏ మాత్రం రెండో ఆలోచన లేకుండా వద్దని చెప్పేశారు. గిఫ్ట్ బాక్స్ లో కేవలం సిల్క్ జుబ్బాలు మాత్రమే ఉన్నాయని మంజు చెప్పినప్పటికీ... అలాంటివి తాను ధరించనంటూ సున్నితంగా తిరస్కరించారు.