: శాంసంగ్ కు మరో షాక్... గెలాక్సీ నోట్ 7ను బ్యాన్ చేసిన విస్తారా
ప్రముఖ మొబైల్ ఫోన్ల కంపెనీ శాంసంగ్ కు మరో షాక్ తగిలింది. తమ విమానాల్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మొబైల్స్ ను నిషేధిస్తున్నామని డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ సంస్థ విస్తారా ప్రకటించింది. క్యాబిన్ బ్యాగ్స్ లోనే కాదు చెక్ ఇన్ బ్యాగేజ్, కార్గోలో కూడా ఈ ఫోన్లు ఉంచుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మలేషియన్ ఎయిర్ లైన్ సంస్థ ఎయిర్ ఏషియా కూడా గెలాక్సీ నోట్ 7ను బ్యాన్ చేస్తున్నామంటూ ఆదివారం ప్రకటించింది. ఈ మొబైల్ లోని బ్యాటరీలు పేలుతున్నాయని, అంటుకుంటున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే, విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. మరోవైపు, మొత్తం గెలాక్సీ నోట్ సిరీస్ నే బ్యాన్ చేస్తున్నట్టు డీజీసీఏ సెప్టెంబర్ 9న ప్రకటించింది. అనంతరం సెప్టెంబర్ 30న తన నిర్ణయాన్ని కొంచెం మార్చుకుంది. అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అప్ డేట్స్ తీసుకున్న తర్వాత, శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్ పై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని డీజీసీఏ అధికారులు తెలిపారు.