: అన్ని పరీక్షలనూ తట్టుకుని నావికాదళం అమ్ముల పొదిలోకి 'ఆరిహంట్'


అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యంతో తయారైన జలాంతర్గామి ఐఎన్ఎస్ ఆరిహంట్ నావికాదళం అమ్ములపొదిలోకి చేరిందని అధికారిక ప్రకటన విడుదలైంది. దాదాపు 6 వేల టన్నుల బరువైన ఈ సబ్ మెరైన్ అన్ని పరీక్షలనూ తట్టుకుని నిలిచిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. గడచిన ఆగస్టులో నావీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఈ సబ్ మెరైన్ ను నేవీకి రహస్యంగా అప్పగించగా, నాటి నుంచి వివిధ రకాల పరీక్షలను నిర్వహించారు. అవన్నీ ఇప్పుడు పూర్తి అయ్యాయి. ఉపరితలంపై నుంచి, నీటిలో నుంచి, గాల్లో నుంచి అణ్వాయుధాలు ప్రయోగిస్తే, గుర్తించి వాటిని గాల్లోనే పేల్చేయడంతో పాటు, శత్రుదేశాల నౌకలపై క్షిపణులను, సముద్రంలో నుంచి ఎంపిక చేసిన ప్రాంతాలపై అణు బాంబులు ప్రయోగించే సత్తా ఐఎన్ఎస్ ఆరిహంట్ కు ఉంది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు కాగా, దీని నిర్వహణకు మొత్తం 100 మంది నిత్యమూ శ్రమిస్తుంటారు. వీరందరికీ రష్యా శాస్త్రవేత్తలు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీనిలో ఉంచే అణు ఇంధన రియాక్టర్ ను 10 మీటర్ల సైజుకు తగ్గించేందుకు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. సాధారణ సబ్ మెరైన్లతో పోలిస్తే, ఇది మరింత ఎక్కువ సేపు సముద్ర అంతర్భాగంలో దాగుండగలుగుతుంది.

  • Loading...

More Telugu News