: ప్రేమ పేరుతో శారీరక సంబంధం.. ఆపై పెళ్లాడి మరో మోసం.. విడాకులిచ్చి ఆమెకు మరోపెళ్లి.. బిడ్డను రూ.25వేలకు విక్రయించిన దుర్మార్గుడు


ప్రేమ పేరుతో యువతితో శారీక సంబంధం పెట్టుకుని, ఆపై ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ ప్రబుద్ధుడు పోలీసులు, పెద్దల ఒత్తిడితో ఆమె మెళ్లో మూడుముళ్లు వేశాడు. ఆపై కొన్నాళ్లపాటు కాపురం చేశాక పుట్టిన బిడ్డను.. పిల్లలు లేని దంపతులకు విక్రయించాడు. ఆపై ఆమెకు విడాకులిచ్చి ఓ మధ్య వయస్కుడైన వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశాడు. బాధితురాలు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయపడింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఎంబ్రాయిడరీ పనిచేసే షావేజ్ అనే యువకుడి వద్ద ఓ మహిళ జరీ వర్క్ చేసేందుకు 2013లో పనికి కుదిరింది. అలా వారిద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమకు, ఆ తర్వాత శారీరక సంబంధానికి దారి తీసింది. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి యవతికి అతడి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. విషయం పెద్దలకు చేరడం, పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో షావేజ్ ఆమెను వివాహం చేసుకోక తప్పలేదు. ఆ తర్వాత వారికి పుట్టిన బిడ్డను పిల్లలు లేని దంపతులకు రూ.25 వేలకు విక్రయించిన షావేజ్ భార్యకు విడాకులిచ్చాడు. అనంతరం ఓ మధ్య వయసు వ్యక్తిని చూసి ఆమెకు బలవంతంగా పెళ్లి చేశాడు. అతడికి అప్పటికే ఏడుగురు పిల్లలున్నారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు మరోమారు పోలీసులను ఆశ్రయించింది. షావేజ్ ద్వారా తాను పడుతున్న ఇబ్బందులను వారికి వివరించింది. తనను రెండుసార్లు మోసం చేసిన అతడిని చట్టపరంగా శిక్షించాలని వేడుకుంది. విక్రయించిన తన బిడ్డను తిరిగి తనకు అప్పగించాల్సిందిగా వేడుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News