: అశ్విన్ - హర్భజన్, అశ్విన్ - యాసిర్... అంతా సర్దుకున్నారు!


ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కేంద్రంగా చెలరేగిన మాటల వివాదం సద్దుమణిగింది. ఓ నాలుగేళ్ల క్రితం ఇప్పుడున్నటువంటి పిచ్ లు ఉంటే, అనిల్ కుంబ్లే, తాను మరిన్ని వికెట్లు పడగొట్టేవాళ్లమని వ్యాఖ్యానించి దుమారం రేపిన హర్భజన్ సింగ్ సర్దుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల పంట పండించుకోవడంతో, అతన్ని ఉద్దేశించే హర్భజన్ వ్యాఖ్యానించాడని పెద్ద చర్చే నడిచింది. ఇక ఈ వివాదాన్ని పెద్దది చేయకూడదన్న ఉద్దేశంతో అటు అశ్విన్, ఇటు హర్భజన్ స్పందించారు. హర్భజన్ తనకెంతో స్ఫూర్తి అని, 2001లో అతడిని చూశాకే ఆఫ్ స్పిన్ మొదలు పెట్టానని అశ్విన్ వ్యాఖ్యానిస్తే, తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని, అశ్విన్ కు వ్యతిరేకంగా తానేమీ మాట్లాడలేదని హర్భజన్ వ్యాఖ్యానించాడు. మరోవైపు పాక్ ఆటగాడు యాసిర్ ఇటీవల, అశ్విన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా, ఇప్పుడు ఇద్దరూ భాయీ భాయీ అనుకునేలా మారారు. వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో 5 వికెట్లు తీయడం ద్వారా టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా యాసిర్ నిలిచాడు. యాసిర్ కు శుభాకాంక్షలు చెబుతూ అశ్విన్ ట్వీట్ చేశాడు. అతని బౌలింగ్ చూసేందుకు ఆనందంగా ఉందని, అతనికి మంచి జరగాలని కోరుకున్నాడు. దీనిపై స్పందించిన యాసిర్, అశ్విన్ కు థ్యాంక్స్ చెబుతూ, టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన టాప్-2 ఆటగాడి నుంచి తనకు అభినందనలు రావడం సంతోషకరమని అన్నాడు. ఇండియాలో ఆడాలన్న తన మనసులోని కోరికను వెలిబుచ్చాడు. ఇక ఆటగాళ్లంతా సర్దుకోవడంతో ఆశ్విన్ కేంద్రంగా సాగిన వివాదాలన్నీ సమసిపోయినట్టే!

  • Loading...

More Telugu News