: మయన్మార్‌లో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 32 మంది జలసమాధి.. వందమందికిపైగా గల్లంతు
మయన్మార్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. చిండ్విన్ నదిలో ప్రమాదవశాత్తు ఓ పడవ మునిగిన ఘటనలో ఇప్పటి వరకు 32 మంది మృతి చెందగా మరో 100 మందికిపైగా గల్లంతయ్యారు. వీరిలో ఎక్కువమంది యూనివర్సిటీ విద్యార్థులు, స్కాలర్లు ఉన్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు 154 మందిని రక్షించారు. ఉత్తర మొన్వాయా పట్టణానికి 72 కిలోమీటర్ల దూరంలో చింద్విన్ నదిపై జరిగిన ఈ ప్రమాదానికి అధిక బరువే కారణంగా తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య వందకు చేరే అవకాశం ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పడవ సామర్థ్యం 150 మంది కాగా మరో వందమందిని అదనంగా ఎక్కించుకోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.