: చర్చలకు ఆహ్వానించకుండా పోలీసులతో అణచివేయిస్తారా?.. ప్రభుత్వంపై కోదండరాం సీరియస్


తెలంగాణలో ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనపై తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన సహేతుకంగా లేదని పేర్కొన్నారు. ప్రజల అభీష్టం మేరకు పునర్విభజన జరగకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. జిల్లాల విభజనలో భాగంగా మండలాలు, గ్రామాల విలీనాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం జేఏసీ ప్రతినిధులతో కలిసి సీఎస్ రాజీవ్ శర్మకు కోదండరాం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న వారిని చర్చలకు ఆహ్వానించకుండా పోలీసులతో అణచివేయాలని చూడడం సరికాదన్నారు. విభజనపై ఆవేదనతో ఇటీవల ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, వీరిలో ఇద్దరు మృతి చెందారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకుంటే ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాల విభజనకు సంబంధించి తొలుత జారీ చేసిన నోటిఫికేషన్ ఓ రకంగా ఉందని, తుది ప్రకటన మరోలా ఉందని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో జరిగిన మార్పుచేర్పులు ప్రజలను ఆవేదనకు గురిచేశాయన్నారు. తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి చెప్పుకునేలా వెసులుబాటును ప్రజలకు కల్పించాలని కోరారు.

  • Loading...

More Telugu News