: బాగ్దాద్‌లో మరో ఆత్మాహుతి దాడి.. 10 మంది మృతి
రెండు రోజుల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 50 మంది మృతి చెందిన ఘటన మరవకముందే ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం మరోసారి రక్తమోడింది. అక్కడి ఆర్మీ చెక్‌పోస్ట్ దగ్గర ఉగ్రవాదులు కారు బాంబుతో ఆత్మాహుతి దాడి చేశారు. దాడిలో పది మంది మృతి చెందారు. మరో 17 మంది గాయాలపాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2014 నుంచి ఉగ్రవాదుల అధీనంలో ఉన్న మోసోల్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్ సైన్యంతో సహా కుర్దిష్ పెష్మెర్గా దళాలు, సున్నీ, షియా హషిద్ షాబీ పారామిలిటరీ సిబ్బంది ఆ నగరాన్ని కొన్ని గంటల క్రితం చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు బాగ్దాద్‌పై దాడులు జరిపారు. అయితే, ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఇంతవరకు ప్రకటించలేదు.