: ఐదేళ్ల తర్వాత ట్విట్టర్ ఉండదు: ప్రముఖ రచయిత చేతన్ భగత్
సుప్రసిద్ధ రచయిత చేతన్ భగత్ ప్రముఖ సోషల్‌మీడియా సైట్ ట్విట్టర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్ల తరువాత ట్విట్టర్ ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలంలో ఆ సైట్‌లో సెలబ్రిటీలపై కామెంట్స్ అధికంగా ఉన్నాయని, దీంతో ఆ సైట్ పై చెడు ప్రభావం పడుతోందని ఆయన అన్నారు. అందుకే ఎందరో సెలబ్రిటీలు ఆ సైట్‌కి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అనేక అంశాల్లో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్టులు అధికంగా వస్తున్నాయని ఈ కారణంగానే సెలబ్రిటీలు ఆ సైట్‌ను వదిలేసి ఇతర వేదికల కోసం చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్కుట్, మైస్పేస్ సైట్లు కనుమరుగవుతున్నట్లు ట్విట్టర్ సైతం అదే పరిస్థితి ఎదుర్కుంటుందని చేతన్ భగత్ చెప్పారు. తాను కూడా తన పుస్తకాలు పబ్లిసిటీ చేసుకోవడానికి ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొన్ని సార్లు సోషల్‌మీడియా వేదికగా తనపై కూడా పలువురు జోక్స్ వేసి నవ్వుకుంటున్నారని, తాను ట్విట్టర్‌ని ప్రచారం కోసం వాడుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. చేతన్ భగన్ తాను రాసిన ‘వన్ ఇండియన్ గర్ల్’ పుస్తకాన్ని ట్విట్టర్ ద్వారా ప్రచారం చేయాలని చూశారు. అందుకోసం ఆయన తన అభిమానులకు తాను రాసిన పుస్తకాన్ని అందమైన బ్యాక్‌డ్రాప్‌తో ఫొటో తీయాలని సూచించారు. దాన్ని మళ్లీ తనకు ట్వీట్ చేస్తే అందులో తనకు నచ్చిన ఓ ఫొటోని రీట్వీట్ చేస్తానని పోస్టు చేశారు. అయితే, దాని పట్ల ఆయనకు నెటిజన్ల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ పుస్తకాన్ని ఐసిస్ ఉగ్రవాదులు తాము చంపబోతున్న వ్యక్తిచేత చదివిస్తున్నట్లు కార్టూన్లు వేసి పంపించారు. పాత న్యూస్‌పేపర్లతో ఆ పుస్తకం సమానమని చిత్రాలు పోస్టు చేశారు. ఇటీవల యూరీ దాడి, సర్జికల్ స్ట్రయిక్స్ పై భగత్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసినప్పుడు ఆయన సర్కారుకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రీ ట్వీట్లు వచ్చాయి. వీటిపై స్పందించిన భగత్... తనలాంటి రచయితలు తమకు ఏది సరైందని అనిపిస్తే అదే చెప్పాలని చూస్తారని అన్నారు. ఒక్కోసారి తాము చేసే వ్యాఖ్యలు సానుకూలంగా ఉండొచ్చు, లేదా ప్రతికూలంగా ఉండొచ్చని చెప్పారు. తాను సర్కారుకి ప్రతికూలంగా వ్యాఖ్యలు చేస్తున్నానని కొందరు రచయితలు అనడం మూర్ఖత్వమేనని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని పాలిస్తోన్న సర్కారు అవినీతికి పాల్పడితే తాను ఎదిరిస్తానని అన్నారు. అదే సర్కారు ఉగ్రవాదులపై దాడి చేస్ అందుకు అనుకూలంగా ఉంటానని పేర్కొన్నారు.