: బ్రిక్స్ సమావేశాలు ముగిసీ ముగియగానే మాట మార్చి బుద్ధి చూపించిన చైనా!
ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదానికి పుట్టిల్లు పాకిస్థానే అంటూ బ్రిక్స్ సమావేశాల్లో బల్లగుద్ది చెప్పిన వేళ మౌనంగా వున్న చైనా, సమావేశాలు ముగియగానే తన బుద్ధి చూపించుకుంది. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ స్పందిస్తూ, ఉగ్రవాదాన్ని ఏ ఒక్క దేశానికి లేదా మతానికి ముడి పెట్టే ఉద్దేశం తమకు లేదని, తాము ఆ పని చేయబోమని స్పష్టం చేశారు. "భారత్, పాకిస్థాన్ లు ఉగ్రవాద బాధితులన్న సంగతి అందరికీ తెలుసు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పాక్ ఎన్నో త్యాగాలు చేసింది. ఉగ్రవాదుల ఏరివేతకు శ్రమిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఈ విషయాన్ని గుర్తించి గౌరవించాలి" అని పాక్ పై ఉన్న తన అవ్యాజమైన ప్రేమను చైనా తరఫున చున్యింగ్ చూపించారు. కాగా, పాకిస్థాన్ తో మిత్రత్వాన్ని నడుపుతున్న చైనా, భారీ ఎత్తున ఆ దేశంలో పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఎకనామిక్ కారిడార్ ను కూడా చైనా చేపట్టింది. జైషే మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత వాదనను చైనా సాంకేతిక కారణాలు చూపుతూ వీటో చేసిన సంగతీ విదితమే.