: ‘అనంత’లో మంజునాథ కమిషన్ ముందు బీసీ నాయకుల నిరసన.. కాపు నాయకుల ప్రతిదాడి.. ఉద్రిక్తత
బలిజలను బీసీల్లో చేర్చే అంశంపై మంజునాథ్ కమిషన్ ఈ రోజు అనంతపురంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లలితకళా పరిషత్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని బీసీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బలిజలను బీసీల్లో చేర్చడానికి తాము ఒప్పుకోబోమంటూ బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ర్యాలీగా వచ్చిన సుమారు 200 మంది బీసీ నాయకులు ఆందోళన తెలిపారు. కాపు నాయకులు కూడా ప్రతిదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య కూడా తోపులాట జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఆ ప్రాంతానికి మంజునాథ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ, సభ్యులు ఆచార్య సుబ్రహ్మణ్యం, ఆచార్య పూర్ణచంద్రరావు, ఆచార్య సత్యనారాయణ హాజరయ్యారు.