: రూపాయి విలువ అంచనాలపై తలోదారి... భారీ పతనమని ఒకరు, బలపడుతుందని మరొకరు!


దాదాపు రెండేళ్ల తరువాత గత కొంతకాలంగా బలపడుతూ, డాలర్ తో మారకపు విలువను మెరుగు పరచుకుని ముందుకు సాగుతున్న రూపాయి మారకపు విలువ భవిష్యత్తులో ఏ దిశగా సాగుతుందన్న విషయంలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ప్రపంచంలోనే కరెన్సీ విలువను అత్యంత కచ్చితంగా అంచనా వేసే టాప్ 2 సంస్థలు రూపాయి విలువపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన పరపతి సమీక్షలో కఠిన నిర్ణయాలు తీసుకోనుందని, దీని కారణంగా మార్చి నాటికి రూపాయి విలువ 2.6 శాతం పతనం కావచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ అంచనా వేసింది. ప్రస్తుతం 66.71 వద్ద ఉన్న రూపాయి విలువ 68.50 వరకూ పడిపోతుందని వెల్లడించింది. ఇదే సమయంలో కరెన్సీ అంచనాల్లో నమ్మకమైన నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ లిమిటెడ్ విభిన్న వాదన వినిపించింది. ఇండియాలో ఆర్థిక వృద్ధి, భారత్ కు వచ్చే పెట్టుబడుల కారణంగా డాలర్ తో రూపాయి విలువ 66.20 వరకూ మెరుగుపడనుందని పేర్కొంది. కాగా, ఆగస్టు 2013లో రూపాయి విలువ 68.84కు పడిపోతుందని 2012లో హెచ్డీఎఫ్సీ వేసిన అంచనాలు నిజమయ్యాయి. ఆపై భారత కరెన్సీ బలపడుతుందని ఆ బ్యాంకు వేసిన అంచనా కూడా సరైనదేనని తేలింది. ఈ నేపథ్యంలో మరోసారి హెచ్డీఎఫ్సీ అంచనాలు ఫలిస్తే, అంతర్జాతీయ ట్రేడర్లకు గడ్డుకాలమే.

  • Loading...

More Telugu News