: వేలాది మంది స్నేహితులున్నా ఒంటరితనం పెంచుతున్న సోషల్ మీడియా!


సోషల్ మీడియాలో వందలాదిమంది స్నేహితులున్నా ఒంటరితనంతో చాలా మంది బాధపడుతున్నారని ఒక సర్వే తెలిపింది. నూటికి 77 మంది తమ జయాపజయాలను పంచుకునే సరైన స్నేహితుడి కోసం పరితపిస్తున్నారని ఆ సర్వే పేర్కొంది. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరువాత 57 శాతం మంది భావోద్వేగాల పార్శ్వాన్ని మర్చిపోతున్నారని ఆ సర్వే అభిప్రాయపడింది. 24 గంటలూ సోషల్ మీడియా ద్వారా ఆన్ లైన్ లో అందుబాటులో ఉండాలన్న ఒత్తిడిని యువతరం ఎదుర్కొంటోందని, సోషల్ మీడియా మత్తులో అర్ధరాత్రో, అపరాత్రో నిద్రపోవడం, ఏదో మర్చిపోయిన వారిలా నిద్రలో ఉలిక్కిపడి లేచి సోషల్ మీడియాలో అప్ డేట్స్ చెక్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని ఈ సర్వే తెలిపింది. దీంతో నేటి యువతరం పలు సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ప్రధానంగా ఉత్తి పుణ్యానికే చికాకుపడడం, జలుబు, ఫ్లూ, గ్యాస్ట్రో ఎంటరైటిస్ వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియా ప్రభావంతో అవసరమున్నా లేకున్నా ఖరీదైన వస్తువులు (ఆన్ లైన్ షాపింగ్) కొంటున్న వారు పెరిగిపోతున్నారు. లగ్జరీ జీవితపు ఫోటోలు చూసి, తమ తాహతు మర్చిపోయి, ఆ తరువాత ఇబ్బందుల పాలవుతున్నవారు పెరిగిపోతున్నారని ఈ సర్వే అభిప్రాయపడింది. అంతే కాకుండా డిజిటల్ మీడియాలో స్నేహితులతో ప్రతి దానికీ పోల్చుకుంటూ, ఈర్ష్య, అసూయ, అభద్రత, ఆత్మన్యూనతతో బాధపడుతున్నారని, దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన మరికొందరు మద్యం, డ్రగ్స్ బానిసలుగా మారుతున్నారని తెలుస్తోంది. ఫ్యాషన్, కల్చర్ పేరుతో మరికొందరు సోషల్ మీడియా కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయని ఈ సర్వే వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో వెతుక్కుంటున్న కృత్రిమ స్నేహానికి, వ్యక్తిగత బంధాలకు చాలా తేడా ఉంటుందని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. వ్యక్తిగత అభిరుచులు, బంధాలు మనిషిలో ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో కీలక పాత్రపోషిస్తాయని, సోషల్ మీడియా సంబంధాలు ఒత్తిడి పెంచుతాయని వారు పేర్కొంటున్నారు. వాస్తవమైన ఆత్మీయతకు దూరమై, మెషీన్ లో బంధాలు వెతుక్కోవడంతో చాలా మంది యువత డిప్రెషన్ బారినపడుతున్నారని వారు చెబుతున్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ మనుషులతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని వారు సూచిస్తున్నారు. నాలుగైదు గంటలు ఫేస్ బుక్, వాట్స్ యాప్ లలో గడిపితే మీరు సోషల్ మీడియా బానిసగా మారుతున్న విషయాన్ని గుర్తించాలని, దానిని నియంత్రించుకోవడం ద్వారా పలు సమస్యలకు దూరంకావచ్చని వారు హెచ్చరిస్తున్నారు. స్వయం నియంత్రణ ద్వారా సమస్యల బారినుంచి తప్పించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇలా ఒంటరితనం బాధిస్తే...మనసుకు నచ్చినవారితో ఎక్కువ సమయం గడుపుతూ, (సోషల్ మీడియా మినహా) నచ్చిన పనులు చేయడం ద్వారా ఇతర వ్యాపకాల్లో నిమగ్నమైతే ఒంటరితనం నుంచి దూరం కావచ్చని సలహా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News