: 500 కోట్ల కాల్ సెంటర్ స్కాంలో ఐపీఎస్ కుమారుడు?
అమెరికాలో పన్ను ఎగవేత దారులను బెదిరింపులకు గురిచేసి వసూళ్లకు పాల్పడిన 500 కోట్ల రూపాయల థానే కాల్ సెంటర్ స్కాంలో తాజాగా మరో విషయం వెల్లడైంది. ఈ కుంభకోణంలో గుజరాత్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి కుమారుడి హస్తం కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో థానే క్రైమ్ బ్రాంచ్ ఇప్పటి వరకు 70 మంది నిందితుల్ని అరెస్ట్ చేయగా, ఈ స్కాం సూత్రధారి సాగర్ థక్కర్ అలియాస్ షగ్గీకి గుజరాత్ కి చెందిన ఐపీఎస్ అధికారి కుమారుడితో సంబంధాలున్నట్లు గుర్తించామని థానే పోలీసులు వెల్లడించారు. ముంబైలో షగ్గీ స్కాంను నడిపించగా, ఐపీఎస్ అధికారి కుమారుడు అహ్మదాబాద్ నుంచి ఈ స్కాం నడిపించినట్లు థానే పోలీసులు గుజరాత్ పోలీసులకు సమాచారమందించారు. దీంతో అహ్మదాబాద్ లోని పలు కాల్ సెంటర్లలో లోకల్ పోలీసుల దాడుల అనంతరం తిరిగి కాల్ సెంటర్ల సేవలు పునఃప్రారంభమయ్యాయి. దాడులు చేసినా ఇప్పటి వరకు అక్కడి కాల్ సెంటర్ల యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకోకపోవడంపై థానే క్రైమ్ బ్రాంచ్ ఆరాతీస్తోంది. కాగా, 2009లో అహ్మదాబాద్ లోని ప్రహ్లాద్ నగర్ లో కొన్ని అనధికారిక కాల్ సెంటర్లు ఉన్నాయని ఓ కేసు విచారణలో పోలీసులకు నిందితులు వెల్లడించారు. అదీకాకుండా అహ్మదాబాద్ లోని ఓ కాల్ సెంటర్ లో భారీ సర్వర్ కూడా ఉన్నట్లు వారు తెలిపారు. దీనిని పోలీసులు కూడా గుర్తించామన్నారు. దీని నుంచి థానేలోని మీరారోడ్డులోని కాల్ సెంటర్లకు డేటా వెళుతోందని అప్పట్లో పోలీసులు వెల్లడించారు. వీటి ద్వారానే గుజరాత్ ఐపీఎస్ కుమారుడు ఈ స్కాంను నడిపించి ఉంటాడని థానే క్రైమ్ బ్రాంచ్ భావిస్తోంది.