: పవన్ కల్యాణ్ ఎఫెక్ట్... రేపే ఆక్వాఫుడ్ కంపెనీతో మాట్లాడుతా: భీమవరం ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఆక్వాఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఆ ప్రాంత రైతులు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకపోతే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించడంతో ఏపీ గవర్నమెంట్ స్పందించింది. ఆక్వాఫుడ్ పరిశ్రమపై సీఎం చంద్రబాబునాయుడు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమ యాజమాన్యం, ప్రజలతో మాట్లాడాలని వారిని ఆదేశించింది. దీంతో ఆ ప్రాంత ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ, రేపే తాను ఆక్వాఫుడ్ పార్క్ యాజమాన్యంతో మాట్లాడుతానని అన్నారు. వ్యర్థాలు డ్రైన్ లలోకి వెళ్లకుండా సముద్రంలోకి వ్యర్థాలు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే యనమదుర్రు డ్రైన్ ను కూడా శుద్ధి చేయాలని సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు. ప్రజలు నష్టపోకుండా, ప్రజలకు మేలు జరిగేలా, వారి అనుమానాలన్నీ తీరుస్తామని తెలిపారు. పరిశ్రమల వల్లే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. పరిశ్రమలతో పాటు, ప్రజల సంక్షేమం కూడా తమకు కావాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.