: ‘తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు’.. సీఎం చంద్రబాబుపై మండిపడ్డ హరీశ్‌రావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు అడ్డుతగులుతున్నారని అన్నారు. ఇటీవల జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను ఆయన వ్యతిరేకించారని హరీశ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు అసలు రైతులపై మాట్లాడే హక్కే లేదని హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ నేతలు గతంలో వ్యవసాయం దండగని అన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారని, రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరించే ఉద్దేశమే ఉంటే ఢిల్లీలో చంద్రబాబు ఇచ్చిన దరఖాస్తును మళ్లీ వెనక్కి తీసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. ఓ వైపు ఢిల్లీలో ప్రాజెక్టులకు అడ్డుపడుతూనే మరోవైపు ప్రాజెక్టులపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓ అజెండా అంటూ ఏమీ లేదని హరీశ్ అన్నారు. తెలంగాణలో రైతులు ఆనందంగా ఉన్నప్పటికీ వారికి సమస్యలున్నాయంటూ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో ఎరువులు, విత్తనాల కొరత లేదని వ్యాఖ్యానించారు. రబీ కోసం ప్రభుత్వం ఎరువులను ఇప్పటికే నిల్వ ఉంచిందని చెప్పారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని అన్నారు.