: సీరియల్ కిల్లర్లుగా, సైకోలుగా కేవలం మగాళ్లే ఎందుకు మారతారు?... అధ్యయనంలో వెలుగు చూసిన వాస్తవాలు


సినిమాల్లో సీరియల్ కిల్లర్లు, సైకోలుగా మగాళ్లను మాత్రమే చూపిస్తారు. పాత్రకు తగ్గట్టు అత్యంత క్రూరంగా నటిస్తూ ఆయా నటులు కూడా ఆకట్టుకుంటారు. అయితే నిజజీవితంలో సైకోలు, సీరియల్‌ కిల్లర్లుగా మారేది కూడా మగవారేనని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో అసలు మగాళ్లే ఎందుకు సీరియల్‌ కిల్లర్లుగా మారుతున్నారు? అన్నది తెలుసుకునేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జిమ్‌ పాలెన్‌ గత 35 ఏళ్లుగా సుదీర్ఘ పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సుమారు 70 మంది సీరియల్‌ కిల్లర్ల మెదళ్లపై పరిశోధనలు చేసి, పలు ఆసక్తికర అంశాలు కనుగొన్నారు. అందులో ప్రధానంగా మెదడు దెబ్బతినడం లేదా, సెరటోనిన్‌ అనే రసాయనం ఎక్కువగా విడుదలవడం అనేవి ఒక మగాడు సైకో లేదా సీరియల్ కిల్లర్ గా మారడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన గుర్తించారు. ఈ సీరియల్‌ కిల్లర్లందరిలోనూ కనుబొమ్మకు ఎగువ భాగాన ఉండే ‘ఆర్బిటోఫ్రంటల్‌ కార్టెక్స్‌’ దెబ్బతినడాన్ని గుర్తించారు. మెదడుకు సంకేతాలు అందజేయడంతోపాటు నిర్ణయాలు తీసుకోవడంలో ఈ భాగం కీలకపాత్ర పోషిస్తుంది. దీనితో పాటు వారిలో కోపం, ఉద్రేకాలను నియంత్రించే ఎంఏఓఏ జన్యువు నుంచి సెరటోనిన్‌ అనే రసాయనం పరిమితికి మించి విడుదలవుతుండడం కూడా మరో కారణమని ఆయన తెలిపారు. ఈ రెండింటి వల్ల మనిషి కోపం, క్షణికావేశం, ఉద్రేకాలను నియంత్రించుకోలేక సైకో లేదా సీరియల్ కిల్లర్ గా మారుతాడని, ఈ రసాయనాలు తల్లి నుంచి కేవలం పురుషులకు మాత్రమే సంక్రమిస్తాయని, దీంతో సీరియల్ కిల్లర్ లేదా సైకోలుగా పురుషులు మాత్రమే మారతారని ఆయన పేర్కొన్నారు. వీటికి తోడు ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు కూడా సీరియల్‌ కిల్లర్‌ లేదా సైకో అవడానికి కారణమవుతాయని ఆయన తెలిపారు. సాధారణంగా బాల్యం నుంచి హింసాత్మక వాతావారణంలో పెరిగిన వారే ఇలా సైకోలు లేదా సీరియల్ కిల్లర్ లుగా మారుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News