: ఇలియానా బాటలోనే రామ్‌చరణ్.. న్యూజెర్సీలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొనడం లేదని వెల్లడి
అమెరికా న్యూజెర్సీలోని పీఎన్సీ ఆర్ట్ సెంటర్ లో ‘హ్యూమానిటీ యునైటెడ్ అగైనెస్ట్ టెర్రర్’ పేరిట విరాళాలు సేకరించేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న టాలీవుడ్ నటి ఇలియానా ఇప్పటికే తాను ఆ కార్యక్రమానికి హాజరుకాబోనని చెప్పారు. టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ కూడా అదే యోచనలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని రామ్‌చరణ్ తన సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ఆ కార్యక్రమంలో తన ప్రదర్శన కోసం ఎంతో ఎదురుచూశానని.. కానీ, తన కుటుంబంలోని ఓ వ్యక్తికి ప్రస్తుతం మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైందని రామ్‌చరణ్ పేర్కొన్నారు. తన అభిమానులు తన నిర్ణయంతో నిరాశ చెందకూడదని, ఈ కార్యక్రమానికి బదులు తాను అభిమానుల కోసం మరేదైనా చేస్తానని ఆయన తెలిపారు. ‘హ్యూమానిటీ యునైటెడ్ అగైనెస్ట్ టెర్రర్’ లాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న ఆర్‌హెచ్‌సీకి తన అభినందనలు తెలుపుతున్నట్లు పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మలైకా అరోరా ఖాన్, ప్రభుదేవా, సోఫీ చౌదరితో పాటు పలువురు సెలబ్రీటీలు పాల్గొంటున్నారు.