: దూసుకొచ్చే క్షిపణులను గాల్లోనే పేల్చేసే ఎస్-400 ట్రింఫ్... బ్రిక్స్ సదస్సులో కుదరనున్న డీల్!
పొరుగు దేశాలతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో భారత్ మరో కీలకమైన రక్షణ రంగ డీల్ కుదుర్చుకోనుంది. గోవాలో జరిగే బ్రిక్స్ దేశాధినేతల సమావేశాల్లో భాగంగా, ఎస్-400 ట్రింఫ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు రష్యాతో వేల కోట్ల విలువైన ఒప్పందంపై సంతకాలు పెట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లు ఈ డీల్ పై స్వయంగా సంతకాలు పెడతారని సమాచారం. రక్షణ రంగంలో అత్యాధునికమైన ఈ మిసైల్ వ్యవస్థలో భాగంగా లాంగ్ రేంజ్ (250 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకూ, మీడియం రేంజ్ (120 కిలోమీటర్ల వరకూ) వెళ్లి, గాల్లో దూసుకొస్తుండే అణ్వాయుధాలను, క్షిపణులను ఢీకొనే ట్రింఫ్ మిసైల్స్ వాటిని అక్కడే పేల్చేస్తాయి. అమెరికాకు చెందిన ఎఫ్ 35 యుద్ధ విమానాలు సహా, హైపర్ సోనిక్ మిసైల్స్, ఖండాంతర మిసైల్స్, యుద్ధ విమానాలను సైతం ఇవి తునాతునకలు చేస్తాయి. ఈ తరహా వ్యవస్థలను కనీసం ఐదు సమకూర్చుకోవాలన్నది భారత్ దీర్ఘకాల ఆలోచన. ఈ మిసైల్ విధ్వంసక వ్యవస్థతో ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించవచ్చు. 2007 నుంచి రష్యా వీటిని వినియోగిస్తోంది. గత సంవత్సరంలో 3 బిలియన్ డాలర్లు వెచ్చించి రష్యా నుంచే ఎస్-400 ట్రింఫ్ లను చైనా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, రష్యాకు రెండో కస్టమర్ కానుంది.