: 'నన్ను నమ్మట్లేదుగా... ఇదిగో చూడండి' అంటూ లైవ్ లో తుపాకితో కాల్చుకున్న భగ్న ప్రేమికుడు!
గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందన్న బాధను తట్టుకోలేని ఓ యువకుడు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెబుతూ, ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ, తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన టర్కీలో జరిగింది. ఎర్డోగాన్ సిరిన్ (22) అనే యువకుడు టర్కీ దక్షిణ ప్రాంతంలోని ఓస్మానియే ప్రావిన్స్ ప్రాంత వాసి. తన స్నేహితురాలు బ్రేకప్ చెప్పిందని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి, "నేను ఆత్మహత్య చేసుకుంటానని చెబితే ఎవరూ నమ్మట్లేదు. ఇదిగో చూడండి" అంటూ తుపాకి బ్యారల్ ను తన పొట్టపైకి పెట్టుకున్నాడు. అంతకుముందు తన గర్ల్ ఫ్రెండ్ ను ఉద్దేశించి ఓ కవిత కూడా చెప్పాడు. తనను వీడిపోతుంటే, చేతులు తెగ్గోసినట్లుందని, తన ప్రేమ అమరమని చెప్పుకున్నాడు. తుపాకీ పేలుడు చప్పుడు తరువాత కెమెరా పక్కకు వాలిపోయింది. ఆ సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో ఓ పాట వినిపిస్తూ ఉన్నట్టు టర్కీ న్యూస్ చానల్స్ ప్రకటించాయి. కాగా, ఈ వీడియోను తొలగించినట్టు ఫేస్ బుక్ ప్రకటించింది.