: ఐరోపా తరహాలో కొనసాగుతున్న హైదరాబాద్ రహదారి మరమ్మతులు
హైదరాబాద్ మెట్రో కారిడార్లలో ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన రహదారుల మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనుల కోసం రూ.20 కోట్లను ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోరైలు ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. యూరోపియన్ నగరాల్లో వినియోగించే పవర్ బ్లాక్‌ను ఈ పనుల కోసం మెట్రో సంస్థ ఉపయోగిస్తోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతంలో ఈ తరహా రహదారులు ఇప్పటికే ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో వీటిని హెచ్‌ఎంఆర్ చేపట్టింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఆయా ప్రాంతాల్లో నీరు నిలిచి రోడ్లు పాడై కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సమస్య మళ్లీ రాకుండా పవర్ బ్లాక్స్‌తో మరమ్మతులు కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మెట్రో కారిడార్లలో పలుచోట్ల ఈ పనులను కొనసాగించనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు బీటీ, ఇతర రహదారులకు కూడా టెండర్లు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే బీటీ రోడ్ల పనులు మొదలవుతాయని చెప్పారు. నెల రోజుల్లో మూడు కారిడార్లలో రహదారి మరమ్మతు పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మరమ్మతులు చేపడుతున్న పలు ప్రాంతాల మార్గాలు ఇవే.. * ఎల్‌బీనగర్- దిల్‌సుఖ్‌నగర్- చాదర్‌ఘాట్ * రంగమహల్ జంక్షన్- నాంపల్లి- ఖైరతాబాద్ * పంజాగుట్ట- ఎస్‌ఆర్‌నగర్-కూకట్‌పల్లి * సికింద్రాబాద్- బేగంపేట * జూబ్లీహిల్స్ రోడ్‌నం 5 టు 36, * సికింద్రాబాద్-ముషీరాబాద్.