: తన ధనబలంతో బంగ్లాదేశ్, భారత్ మధ్య దూరుతున్న చైనా!


బంగ్లాదేశ్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని చైనా నిర్ణయించుకుంది. దాదాపు 30 సంవత్సరాల తరువాత ఓ చైనా ప్రధాని నేడు ఢాకాలో పర్యటించనుండగా, మౌలిక వసతులు, పవర్ ప్లాంట్ల నిర్మాణం కోసం 24 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 1.60 లక్షల కోట్లు) రుణంగా ఇవ్వనుంది. ఈ మేరకు క్సీ జిన్ పింగ్ పర్యటనలో సంతకాలు జరగనున్నాయని తెలుస్తోంది. ఒకవైపు బంగ్లాదేశ్ తో ఉన్న స్నేహబంధాన్ని కొనసాగిస్తూ, పలు ప్రాజెక్టులకు 2 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 13 వేల కోట్లు) ఇండియా అందించిన వేళ, చైనా తన ధనబలంతో బంగ్లాదేశ్ కు సైతం దగ్గర కావాలన్న ఆలోచనలు చేస్తోంది. 1,320 మెగావాట్ పవర్ ప్లాంట్ సహా మొత్తం 25 ప్రాజెక్టులకు చైనా నిధులను అందిస్తోందని తెలుస్తోంది. దీంతో పాటు నౌకాశ్రయం నిర్మాణానికీ దీర్ఘకాల రుణమివ్వనుందని బంగ్లాదేశ్ ఆర్థికమంత్రి ఎంఏ మన్నామ్ తెలిపారు. బంగ్లాదేశ్ పర్యటనను ఆ దేశంతో మరింత బలమైన బంధం ఏర్పడేందుకు వారధిగా చేసుకోవాలని చైనా భావిస్తోంది. అందుకే రికార్డు స్థాయి మొత్తాన్ని రుణంగా అందించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తమకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావాలని, వాటి కోసం పెద్దమొత్తంలోనే రుణాలు అవసరమని వ్యాఖ్యానించిన మన్నామ్, చైనా సాయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, పలు కంపెనీలు సైతం బంగ్లాదేశ్ తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. జియాంగ్రూ ఎటెర్న్ కంపెనీ లిమిటెడ్ సంస్థ 1.1 బిలియన్ డాలర్ల వ్యయంతో బంగ్లాలో పవర్ గ్రిడ్ నెట్ వర్క్ ను విస్తరించేందుకు డీల్ కుదుర్చుకుంది. ఎన్నో దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన సొనాడియా నౌకాశ్రయం నిర్మాణం నిమిత్తం త్వరలో కార్యరూపం దాల్చనుందని మన్నామ్ తెలిపారు. ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్ కు భారీ ఎత్తున నిధులివ్వాలన్న చైనా ఆలోచన వెనుక, ఇండియా - బంగ్లాదేశ్ మధ్య దూరాలన్న ఆలోచన ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News