: వైకాపాకు మరో ఝలక్... లోకేష్ ద్వారా రాయబారాలు జరుపుతున్న బూరగడ్డ వేదవ్యాస్!
కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. బూరగడ్డ తనయుడు కిషన్ తేజ్, చంద్రబాబు కుమారుడు లోకేష్ నడుమ ఉన్న స్నేహం కారణంగా బూరగడ్డ చేరికకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన్ను ఆహ్వానించించారు. అప్పట్లో పెడన నుంచి వైకాపా తరఫున పోటీ పడి కాగిత వెంకట్రావు చేతిలో బూరగడ్డ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వైకాపాకు, జగన్ కు ఆయన అంటీముట్టనట్టు ఉంటున్నారు. నిన్న మచిలీపట్నంలోని తన నివాసంలో అనుచరులతో సమావేశమై పార్టీ మారే విషయాన్ని బూరగడ్డ చర్చించగా, భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అయితే, అత్యధికులు పార్టీ మారేందుకే మొగ్గు చూపడంతో వేదవ్యాస్ టీడీపీ చేరిక ఖాయమని సమాచారం. ఇక ఈ విషయంలో కాగిత వెంకట్రావు సహా ఇతర పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.