: ట్రంప్ మామూలోడు కాదు.. బయటపడిన మరో వీడియో.. సోషల్ మీడియాలో వైరల్!


అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ గురించి బయటకొస్తున్న ఒకప్పటి వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. అందులో మహిళలపై ఆయన వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ట్రంప్ తీరును పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఒకదాని వెంట ఒకటి విడుదలవుతున్న వీడియోలు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా 1992 నాటి వీడియో ఒకటి బయటపడి వైరల్ అయింది. ఓ యువతిని ఉద్దేశించి మరో పదేళ్లలో ఆమెతో డేటింగ్ చేస్తానని ట్రంప్ అందులో పేర్కొన్నారు. 2005లో మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఇటీవల బయటపడి తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఎన్ న్యూస్ చానల్ ట్రంప్‌కు సంబంధించిన 1992 నాటి వీడియోను ప్రసారం చేసింది. అందులో ట్రంప్ ఓ మహిళను ఉద్దేశించి ‘మరో పదేళ్లలో ఆమెతో డేటింగ్ చేస్తా’ అని పేర్కొన్నారు. అప్పటికి ట్రంప్ వయసు 46 ఏళ్లు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రాంలో పాల్గొన్న ఓ యువతిని రియాలిటీ టీవీస్టార్ ‘ఎస్కలేటర్ ఎక్కుతున్నావా?’ అని అడిగింది. దీనికి ఆమె ‘అవును’ అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ‘మరో పదేళ్లలో ఆమెతో నేను డేటింగ్ చేస్తా. మీరు నమ్మగలరా?’ అన్నారు. తాజా వీడియోతో ఆయన పరువు మరింత దిగజారింది. ఆయన బారిన పడిన మహిళలు ఇప్పటికే ట్రంప్‌కు వ్యతిరేకంగా మీడియాకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో విడుదలవుతున్న వీడియోలు ట్రంప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వీడియోలు ఆయన విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News