: కువైట్ ఫ్యామిలీ వీసా నిబంధనల్లో మార్పు.. తెలుగు ప్రవాసీయులపై ప్రభావం
కువైట్‌లో పెరిగిపోతున్న విదేశీయులను నియంత్రించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ఫ్యామిలీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారి వేతన అర్హతను రెట్టింపు చేసింది. ఈ నిబంధన కారణంగా అక్కడ ఉద్యోగం చేస్తున్న వారు తమ కుటుంబ సభ్యులను రప్పించుకోవడం కష్టతరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విదేశీయులు, ముఖ్యంగా భారతీయులపై ఈ నిబంధన ప్రభావం చాలా ఎక్కువగా పడుతుందని అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి వేతన పరిమితి 250 దినార్లు(రూ.55 వేలు) కాగా ఇప్పుడు దీనిని ఒకేసారి 450 దినార్లు(దాదాపు రూ.లక్ష)కు పెంచేసింది. కువైట్‌లో నివస్తున్న విదేశీయుల్లో ఈ స్థాయిలో వేతనాలు అందుకుంటున్న వారు అరుదనే చెప్పాలి. భారతీయులైతే మరీ తక్కువ. కువైట్‌లోని గౌరవప్రదమైన జీవన ప్రమాణాలకు విరుద్ధంగా భారత్, ఈజిప్టు నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబాలు కువైట్‌కు ఫ్యామిలీ వీసాపై వచ్చి ఉద్యోగాలు చేస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నిబంధనలో 14 వృత్తుల వారికి మాత్రం ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం గమనార్హం.