: షమీ కూతురు ఐసీయూలో వున్న విషయం కోహ్లీకి తెలియదట!
టీమిండియా పేసర్ మహ్మద్ షమి కుమార్తె ఐసీయూలో ఉన్న సంగతి తనకు తెలియదని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇండోర్ లో జరిగిన మూడో చివరి టెస్టులో విజయం సాధించడం ద్వారా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ను భారత జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. కోల్ కతా వేదికగా జరిగిన రెండో టెస్టులో పేసర్లు భువనేశ్వర్, షమి చెలరేగి... 178 పరుగుల తేడాతో ఘన విజయం కట్టబెట్టారు. ఈ మ్యాచ్ లో షమి 6 వికెట్లతో రాణించాడు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మ్యాచ్ ముగియగానే మహ్మద్ షమీ డ్రెస్సింగ్ రూం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లేవాడు. అక్కడ తన కుమార్తె అహీరా ఐసీయూలో చికిత్స పొందుతోంది. దీంతో ఉదయాన్నే వచ్చి మళ్లీ జట్టుతో కలిసిపోయేవాడు. మ్యాచ్ ఆడుతున్నా మనసంతా కుమార్తెపైనే ఉండేది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన తరువాత షమీ కుమార్తె ఆనారోగ్యంతో ఉన్నట్టు కోహ్లీకి తెలిసింది. షమీ దేనినీ మైదానంలో వ్యక్తం చేయడని, తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకోడని కోహ్లీ అన్నాడు. అందుకే షమీ కుమార్తె ఆసుపత్రిలో ఉన్నట్టు తనకు తెలియదని, మ్యాచ్ ముగిసిన తరువాత తనకు తెలిసిందని కోహ్లీ చెప్పాడు.