: ఆదాల ప్రభాకర్‌రెడ్డి నాకు రాష్ట్ర అభివృద్ధి రొట్టె ఇచ్చారు: సీఎం చంద్రబాబు
నెల్లూరు జిల్లా నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి తనకు రాష్ట్ర అభివృద్ధి రొట్టె ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అక్కడి బారా షాహిద్ దర్గాను ఆయన సందర్శించారు. అందులో ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో 1930 నుంచి రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోందని చెప్పారు. మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఈ పండుగను ప్రజలు జరుపుకుంటున్నారని అన్నారు. రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బంగ్లాదేశ్‌ల నుంచి కూడా ఇక్కడకు వస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, పేద పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నామని చంద్రబాబు అన్నారు. ప్రమాదంలో ఎవరయినా చనిపోయినా, వికలాంగులైనా చంద్రన్న బీమా పథకం కింద రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.