: తెలంగాణ సచివాలయంలో బీజేపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. రైతుల సమస్యలపై వివరించారు. అయితే, సీఎస్‌ను కలిసి బయటకు వచ్చిన తరువాత బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డితో పాటు పలువురు నేతలు సచివాలయంలోని సి బ్యాక్ ఎదుట ఆందోళనకు దిగారు. రైతు సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. రైతులకు పెట్టుబడి రాయితీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం సమతా బ్లాక్ ఎదుట వారు బైఠాయించారు. ఆందోళనకు దిగిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.