: గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్న జగన్: యనమల ఎద్దేవా
హైదరాబాద్ లో ఓ వ్యక్తి ఏకంగా రూ. 10 వేల కోట్ల నల్లధనాన్ని చూపించాడని తమ నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానిస్తే, దానికి వైకాపా స్పందించడం, ఆ విషయం బాబుకు ఎలా తెలుసంటూ జగన్ ప్రధానికి లేఖ రాయడాన్ని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తనదైన శైలిలో విమర్శించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా జగన్ తీరుందని ఆయన ఎద్దేవా చేశారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన యనమల, నల్లధనంపై మోదీకి చంద్రబాబు లేఖ రాస్తే, జగన్ ఉలిక్కి పడుతున్నాడని విమర్శించారు. వైఎస్ హయాంలో జరిగిన అవినీతిపై తాము ఆందోళన చేశామని గుర్తు చేసిన యనమల, సీబీఐ ఇప్పటికే వేల కోట్ల ఆస్తులను సీజ్ చేసిందని అన్నారు. అక్రమంగా ఆస్తులను కూడబెట్టిన కేసులో జైలుకు సైతం వెళ్లొచ్చిన ఘనత ఆయనదేనని, జగన్ కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారని వ్యాఖ్యానించారు.